CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:55 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కొమురవెల్లి స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ఆరా

సిద్దిపేట, సెప్టెంబర్ 18(చైతన్యగళం):

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి స్టేజి వద్ద సికింద్రాబాద్‌–సిద్దిపేట మధ్య ప్రయాణిస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్టీసీ ఎండీతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, క్షతగాత్రులను అధికారులు వెంటనే సిద్దిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.