CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:38 pm Posted by : rakeshkashaveni12@gmail.com

రైతులకు విస్తృతంగా రుణాలు అందించాలి – కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, సెప్టెంబర్ 18(చైతన్యగళం):

ప్రాధాన్యత, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన రైతులకు విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, అవసరమైతే రైతుల కోసం ప్రత్యేక రుణమేళాలు నిర్వహించాలని సూచించారు. వివిధ శాఖల నుంచి గ్రౌండింగ్ కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన రుణాలు అందేలా బ్యాంకులు సహకరించాలని, ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలు, ఉపాధి కల్పన శాఖలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకుల్లో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి అర్హులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. వ్యవసాయ, ప్రాధాన్యత రంగాల్లో పనితీరు తక్కువగా ఉన్న బ్యాంకులు సెప్టెంబర్‌లో ప్రత్యేక రుణమేళాలు నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు కూడా నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చీకోడ్, జగదేవపూర్, కోహెడ ఎస్‌బీఐ బ్యాంకుల బదిలీతో పాటు బ్యాంకింగ్ సేవలు లేని చెప్యాల, ఎల్లారెడ్డిపేట, కొండపోచమ్మ దేవాలయం రెవెన్యూ గ్రామాల్లో నూతన బ్రాంచీల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలకు డీఎల్‌సీ ఆమోదం తెలిపింది.

సమావేశంలో ఎల్‌డీఎం హరిబాబు, డీఆర్‌డీఓ రమేష్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ వెన్న శ్రీనివాస్, ఎస్‌బీఐ ఆర్‌ఎం మారుతి, టీజీబీ ఆర్‌ఎం రాజయ్య, ఏండీసీసీబీ జీఎం శ్రీనివాస్, ఆర్. శెట్టి డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.