CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:54 pm Posted by : rakeshkashaveni12@gmail.com

యాసంగిలో 1,250 ఎకరాల్లో వేరుశెనగ సాగుకు ప్రోత్సాహం

సిద్దిపేట, సెప్టెంబర్ 18 (చైతన్యగళం):

జాతీయ వంటనూనెలు–నూనెగింజల మిషన్‌ 2026–27 పథకం కింద యాసంగి, ముందస్తు రబీ సీజన్‌లో జిల్లాలో వేరుశెనగ సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యానవన, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 1,250 ఎకరాల్లో వేరుశెనగ సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు వేరుశెనగ విత్తనాలను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు పేర్కొన్నారు. హై ల్యాండ్‌ కింద 600 ఎకరాలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్‌ కింద 650 ఎకరాల్లో సాగు చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

వేరుశెనగ సాగుకు అవసరమైన కదిరి లేపాక్షి, గిన్నర్-4 రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వేరుశెనగ సాగు చేపట్టి నూనెగింజల ఉత్పత్తి పెంపునకు సహకరించాలని కోరారు.

హుస్నాబాద్ డివిజన్‌లో అక్కన్నపేట 250, బెజ్జంకి 200, కోహెడ 250, హుస్నాబాద్ 150 ఎకరాలు, సిద్దిపేట డివిజన్‌లో చిన్నకోడూరు 200, సిద్దిపేట రూరల్ 25 ఎకరాలు, ములుగు డివిజన్‌లో వర్గల్ 50, దౌల్తాబాద్ డివిజన్‌లో మిరుదొడ్డి 25, దౌల్తాబాద్ 100 ఎకరాల్లో సాగు చేపట్టేలా ప్రతిపాదించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, ఎల్‌డీఎం హరిబాబు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.