CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష

  • సైబర్ సేఫ్ గణేష్‌ను సందర్శించిన ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, సెప్టెంబర్ 17(చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన “సైబర్ సేఫ్ గణేష్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సందర్శించారు. గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన సైబర్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. గణేష్ ఉత్సవాలను సైబర్ భద్రత అవగాహనతో అనుసంధానం చేయడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్ వంటి బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా, తెలియని వ్యక్తులకు యూపీఐ ద్వారా డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, రివార్డులు, లోన్ యాప్‌లు, కేవైసీ పేరుతో వచ్చే అనుమానాస్పద లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే నగదును నిలుపుదల చేసే అవకాశం ఉంటుందని, అందువల్ల గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడం కీలకమన్నారు.
“నేను సైబర్ సేఫ్ – మీరు సైబర్ సేఫ్” అనే సందేశంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వినియోగించడం పట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవాలను సామాజిక అవగాహన వేదికగా మార్చిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇంచార్జి సీఐ అంజలి, ఎస్‌ఐ ఉమా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.