- ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చొద్దు:టీడీపీ
సిద్దిపేట, సెప్టెంబరు 17 (చైతన్యగళం): రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22-ఏను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు కలెక్టరేట్‌లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ప్రైవేట్ ఆస్తులను తప్పుగా, పరిమితికి మించి చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సెక్షన్ 22-ఏ పరిధి, శాసన ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిషేధిత ఆస్తుల జాబితాలోని రికార్డులను సమగ్రంగా సమీక్షించి అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన విధానం ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఒగ్గు రాజు (తెలుగుయువత), ఎం.డి.హాసన్, పాసికంటి సత్యం, మాచవరం వెంకటేశ్వరరావు, రామంచ రాములు, గౌరీశెట్టి దామోదర్, దూస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.