- గర్భిణీలను ముందస్తుగా నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి
మహబూబాబాద్, సెప్టెంబరు 17 (చైతన్యగళం): పుట్టిన శిశువు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సకాలంలో టీకాలు వేయించాలని సబ్‌యూనిట్ అధికారి వడ్డెబోయిన శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గర్భిణీల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
టీకాలను నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరుస్తూ నాణ్యతకు భంగం కలగకుండా కోల్డ్ చైన్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. టీకా అనంతరం తల్లి, బిడ్డను అరగంట పాటు పరిశీలనలో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించిన తర్వాతే ఇంటికి పంపాలని తెలిపారు.
గర్భిణీలను సకాలంలో నమోదు చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలపై అవగాహన కల్పించి అక్కడే ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. ప్రతి గర్భిణీకి 180 ఐరన్ మాత్రలు, టి.డి. టీకా రెండు డోసులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
టీకాల కార్యక్రమం, గర్భిణీల నమోదు, సురక్షిత ప్రసవాల లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.