CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:33 pm Posted by : CHAITHANYA GALAM NEWS

22-ఏ భూముల సమస్యను పరిష్కరించాలి

  • భూదాన్‌, సీలింగ్‌, మిగులు భూముల వివరాలు బహిర్గతం చేయాలి
  • కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌ఓకు టీడీపీ నేతల వినతిపత్రం

మహబూబాబాద్, సెప్టెంబర్‌ 17(చైతన్యగళం): సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్‌ కొండపల్లి రామచందర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా 22-ఏ నిషేధిత భూములు, భూదాన్‌ భూములు, సీలింగ్‌ భూములు, మిగులు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. 22-ఏ నిబంధనల కారణంగా సామాన్య ప్రజలు, పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించిన కొద్దిపాటి భూమి 22-ఏ జాబితాలో చేరితే విక్రయించుకోవడం, రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం సాధ్యం కాక అత్యవసర సమయాల్లో ఆస్తిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ అవసరాలకు భూమిని ఉపయోగించుకునే అవకాశం కూడా లేకుండా పోతుందని పేర్కొన్నారు.

తప్పుగా 22-ఏ జాబితాలో నమోదైన భూములను తొలగించేందుకు సరళమైన విధానం రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సర్వే నంబర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా భూదాన్‌, సీలింగ్‌, మిగులు భూములకు సంబంధించిన వివరాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుతారపు వెంకటనారాయణ, పిట్టల రాము, పట్టణ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు, కార్యదర్శి తల్లాడ శ్రీనివాస్‌, మాజీ పట్టణ కార్యదర్శి కట్ల వెంకన్న, పట్టణ యువత అధ్యక్షుడు దోంతు నరేశ్‌, మండల పార్టీ అధ్యక్షులు పెరం వీరస్వామి (కోరవి), మామిడాల వెంకన్న (మరిపెడ), భాస్కర్‌ (తోర్రూరు), శ్రీను (గూడూరు), మరిపెడ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మాజీ పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు పంజాల శ్రీను, శంకర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.