CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 2:46 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వాహనాలు ప్రజల కోసమా.. లేక అమ్మేస్తారా?

  • ఫాగింగ్‌, చెత్త సేకరణ వాహనాలు ఎందుకు వినియోగంలోకి రావడం లేదు?: మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 14 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో దోమల బెడద, విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కొత్తగా మంజూరైన ఫాగింగ్‌, చెత్త సేకరణ వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంపై మాజీ మేయర్‌, తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన వాహనాలు ప్రజల సేవలో ఉండాల్సిందిపోయి మూలన ఉండటం ఏమిటని ప్రశ్నించారు.

ప్రజాధనానికి జవాబుదారీతనం ఉండాలి

ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో చెల్లించిన పన్నులతో కొనుగోలు చేసిన ప్రతి వాహనం ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం కోసం ఉపయోగపడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రవీందర్‌సింగ్‌ అన్నారు. దోమల నివారణకు ఫాగింగ్‌ వాహనాలను ప్రతి డివిజన్‌లో క్రమం తప్పకుండా తిప్పాలని, డ్రైనేజీలు, నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు.

వాహనాల వినియోగంపై స్పష్టత ఇవ్వాలి

మున్సిపల్‌ ఆరోగ్య అధికారిని ఉద్దేశించి ‘‘వాహనాలు ప్రజల కోసం తెచ్చారా.. లేక అమ్మకానికి సిద్ధం చేశారా?’’ అని ప్రశ్నించారు. ఒక్కో వాహనానికి సుమారు రూ.2 లక్షల వరకు ముందస్తు చెల్లింపులు తీసుకున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని, అయితే అందులో వాస్తవాలను అధికారిక విచారణ ద్వారా తేల్చాల్సి ఉందన్నారు. తాను ఆరోపణలు చేయడం లేదని, ప్రజల్లో ఉన్న సందేహాలకు అధికారులు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

ఫాగింగ్‌ వాహనాలు ఎప్పుడు వచ్చాయి? ఇప్పటివరకు ఎన్ని రోజులు వినియోగించారు? ఎన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ నిర్వహించారు? నిర్వహణ, ఇంధనం, ఇతర ఖర్చులకు ఎంత మేర బిల్లులు చెల్లించారు? అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వాహనాల కొనుగోలు, వినియోగం, నిర్వహణ, బిల్లులపై నగరపాలక సంస్థ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

చెత్త వాహనాలపైనా ప్రశ్నలు

కొత్తగా వచ్చిన చెత్త సేకరణ వాహనాల పరిస్థితిపైనా రవీందర్‌సింగ్‌ ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని వాహనాలు వినియోగంలోకి రాకముందే మరమ్మతుల షెడ్‌కు వెళ్లినట్లు పేర్కొంటూ వాటిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి వెంటనే ప్రజల సేవలోకి తీసుకురావాలని కోరారు.

‘‘క్లీన్‌ సిటీ అని చెప్పడం మాత్రమే కాదు.. ప్రజలకు అవసరమైన వాహనాలు రోడ్లపైకి వచ్చి పనిచేయాలి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు. ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన వాహనాలను సొంత వాహనాల మాదిరిగా బాధ్యతగా వినియోగించాలి’’ అని రవీందర్‌సింగ్‌ అన్నారు. ఫాగింగ్‌ వాహనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, ఏవైనా అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.