CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 9:08 am Posted by : CHAITHANYA GALAM NEWS

పోషకాహారంతో తల్లి–బిడ్డల ఆరోగ్య పరిరక్షణ

  • గర్భిణీలు, బాలింతలు బలవర్ధక ఆహారం తీసుకోవాలి – జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): గర్భిణీలు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఐసీడీఎస్‌ కరీంనగర్‌ అర్బన్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్కండేయనగర్‌ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనతను నివారించేందుకు మునగ, బచ్చలి వంటి ఆకుకూరలు, పల్లీలు, బెల్లం తదితర పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా లభించే పండ్లు, తాజా కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు బరువు, ఎత్తును పరిశీలించుకోవాలని సూచించారు.

తల్లి, బిడ్డలకు పోషకాహార లోపం లేకుండా కుటుంబ సభ్యులు గర్భిణీలు, బాలింతలను మంచి ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. తక్కువ బరువున్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు.

నెలలు నిండిన గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీడీపీవో కవిత వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు అందించే ఆహారంపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులకు ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో కార్పొరేటర్‌ తెల్ల లక్ష్మీరమేష్‌, సీడీపీవో కవిత, సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్‌ శ్రీలత, రమణ, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.