CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 9:09 am Posted by : CHAITHANYA GALAM NEWS

కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు

  • సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక
  • ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు సౌకర్యాలు కల్పించాలి.. అంబేద్కర్‌ భవనానికి స్థలం వెంటనే కేటాయించాలి

రామగుండం, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఉత్పత్తి కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

సింగరేణి 11 ఇంక్లైన్‌, ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడి మోకాలికి గాయమై ఆరు కుట్లు పడిన ఘటనను ప్రస్తావించిన ఎంపీ.. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. దీనిని చిన్న ఘటనగా తీసుకోకుండా భద్రతా వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాలని సూచించారు. కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, ప్రాణాపాయ పరిస్థితులు ఉండే భూగర్భ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కోరారు.

కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి పెంపునకు మాత్రమే కాకుండా కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రాథమికంగా వినియోగించాలని సూచించారు. ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వరుస ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేలా సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఉత్తర తెలంగాణకు రైలు సౌకర్యాలు పెంచాలి

ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో మెరుగైన రైలు అనుసంధానం కల్పించాలని ఎంపీ వంశీకృష్ణ రైల్వే శాఖను కోరారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ మధ్య అదనపు రైళ్ల కోసం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రైల్వే బోర్డు చైర్మన్‌ సతీష్‌కుమార్‌ను కలిసి ఈ ప్రాంత ప్రజల అవసరాలను వివరించినట్లు పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి రైల్వేకు గణనీయమైన సరకు రవాణా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో ప్రయాణికుల రైలు సౌకర్యాలు లేకపోవడం అన్యాయమన్నారు. ప్రజల అవసరాల ఆధారంగా రైలు సౌకర్యాలను పెంచేందుకు రైల్వే శాఖ అధ్యయనం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన పరీక్షా ప్రయోగాన్ని, పండుగల సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లను స్వాగతించిన ఆయన.. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ అనుసంధానాన్ని శాశ్వతంగా బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు.

అంబేద్కర్‌ భవనానికి స్థలం కేటాయించాలి

అంబేద్కర్‌ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుంచి సుమారు రూ.50 లక్షలు ఇప్పటికే కేటాయించినట్లు వంశీకృష్ణ తెలిపారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ స్థాయి నుంచి సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికీ జాప్యం జరుగుతోందన్నారు.

నిధులు సిద్ధంగా ఉన్నందున సింగరేణి యాజమాన్యం వెంటనే స్థలం కేటాయించి నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు.

కార్మికుల భద్రతకు ప్రాధాన్యం.. ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు అనుసంధానం.. అంబేద్కర్‌ భవనానికి స్థల కేటాయింపు అంశాలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు.