CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 2:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అశోక్‌నగర్‌లో తీరిన తాగునీటి కష్టాలు

  • 54వ డివిజన్‌లో నూతన బోరు ప్రారంభం
  • ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే లక్ష్యం: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): నగరంలోని 54వ డివిజన్‌ అశోక్‌నగర్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసుల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన బోరును నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ శనివారం ప్రారంభించారు.

కాలనీలో తీవ్రంగా ఉన్న నీటి ఎద్దడిని గుర్తించిన 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ ప్రత్యేక చొరవ తీసుకుని బోరు ఏర్పాటు చేయించారు. నీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం మీటర్‌ను సైతం ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, ముఖ్యంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన బాధ్యత అన్నారు. నగరంలోని ఏ ప్రాంతంలోనైనా తాగునీటి సమస్యలు ఉంటే గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు బోరు ఏర్పాటుతో పరిష్కారం లభించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను గుర్తించి బోరుతో పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించిన మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు కుమార్‌, రమేష్‌, అరుణ్‌, శ్రీనివాస్‌, గండి గణేష్‌ తదితరులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.