- ఎస్‌ఐఆర్‌లో హియరింగ్స్, అనామలీస్, నో మ్యాపింగ్‌పై బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా ఎన్నికల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని అదనపు కలెక్టర్, మానకొండూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక ప్రచార దినం సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెజ్జంకి మండలం తోటపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రం, ముస్కానిపేట తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ఎస్‌ఐఆర్‌లో భాగంగా హియరింగ్స్, అనామలీస్, నో మ్యాపింగ్ అంశాలపై బీఎల్‌ఓలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులు, వివరాల సవరణలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వివరాలను తగిన ఆధారాలతో ధ్రువీకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా నో మ్యాపింగ్‌కు సంబంధించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం అందరి బాధ్యత అని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజలు సైతం తమ ఓటు వివరాలను పరిశీలించుకుని, తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత ప్రక్రియలో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.