CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 12:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పలు ప్రాంతాల్లో అగ్నిమాపక అధికారుల ఆకస్మిక తనిఖీలు

  • పాఠశాలల్లో అగ్నిమాపక పరికరాల పనితీరుపై పరిశీలన.. ఐదు రోజులు గడువు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): అగ్ని ప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ చర్యల్లో భాగంగా కరీంనగర్‌ నగరంలోని పద్మనగర్‌, భగత్‌నగర్‌ ప్రాంతాల్లో పలు పాఠశాలలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పాఠశాలల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్నచోట పనిచేసే స్థితిలో లేకపోవడం గుర్తించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

అగ్నిమాపక భద్రతా చర్యలను వెంటనే చేపట్టేందుకు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు ఐదు రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గడువులోగా చర్యలు తీసుకోని పక్షంలో తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులు, అనుమతులు మంజూరు చేసే అధికారులకు నివేదిస్తామని తెలిపారు. అలాగే జగిత్యాల రోడ్డులోని ఏలీట్‌ హోటల్‌, ఆర్‌బీ గార్డెన్‌ విందు మండపాన్ని తనిఖీ చేసి భద్రతా చర్యలపై ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు.

అగ్నిమాపక శాఖ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని శ్రీనివాస్‌ తెలిపారు. వ్యాపార, వాణిజ్య, విద్యా, వైద్య, వినోద ప్రాంగణాల నిర్వాహకులు అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టి సహకరించాలని కోరారు. కరీంనగర్‌ నగరాన్ని అగ్ని ప్రమాదాలు, ప్రాణనష్టానికి తావులేని నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.