CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మట్టి వినాయకుడితోనే పర్యావరణ పరిరక్షణ

  • మట్టి విగ్రహాలనే పూజించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్

మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ కోర్టు సిబ్బంది, ప్రజలకు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పూర్వీకుల సంప్రదాయాలను పాటిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి, సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెల్లి, కోర్టు ముఖ్య పరిపాలన అధికారి శ్రీనివాస్, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.