- తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు మైస శ్రీనివాసులు
మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): తెలంగాణలో విద్యారంగ సంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు మైస శ్రీనివాసులు అన్నారు. విద్యను కేంద్రీకృతం చేసే విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విద్యారంగ సంక్షోభం–సవాళ్లు, కర్తవ్యాలు’ అనే అంశంపై శుక్రవారం టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బలాస్టి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మైస శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజలు కోరని కొత్త విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ విద్యను కేంద్రీకృతం చేయడం సరైన విధానం కాదని, ఇది ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం వివిధ పేర్లతో భిన్న రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం కామన్ స్కూల్ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపరచేందుకు ప్రతి తరగతికి ఒక తరగతి గది, ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించకుండా ఎన్ని కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు సాధ్యం కావని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడానికి ప్రజా ఉద్యమం అవసరమని, అన్ని రాజకీయ పార్టీలు విద్యా పరిరక్షణ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలంటే విద్య ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్నారు. విద్యలో అంతరాలను తొలగించేందుకు సమాన అవకాశాలు కల్పించే కామన్ స్కూల్ విధానమే పరిష్కారమని, అది విద్యా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల భాస్కర్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు కొత్తపల్లి రవి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రాజు, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ బందెల రాజు, పీడీఎస్‌యూ నాయకులు బోనగిరి మధు, చైతన్య, మహేష్, ఎస్‌కే షబ్బీ, టీపీటీఎఫ్ నాయకులు సి.రెడ్డి రామలింగారెడ్డి, ప్రకాష్, ఈసల లక్ష్మయ్య, భీముడు తదితరులు పాల్గొన్నారు.