CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కంటి చూపుకు సుంకిరెడ్డి అండ

  • కడ్తాల్‌లో 6వ మెగా కంటి శిబిరం..
  • తొలిరోజే 350 మందికి పరీక్షలు, 30 మందికి శస్త్రచికిత్సలకు ఎంపిక

ఆమనగల్లు, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంటి వైద్య సేవల్లో భాగంగా కడ్తాల్‌లో 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. కడ్తాల్‌ పట్టణంలోని ఎంబీఏ గార్డెన్స్‌లో శంకర నేత్రాలయ, చెన్నై వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న శిబిరానికి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తొలిరోజు 600 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా, 350 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. 180 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా, 30 మందిని కంటి శుక్లాల శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాల్లో చాలామంది కంటి సమస్యలకు సకాలంలో వైద్యం చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. అందుకే కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు అందిస్తున్నట్లు చెప్పారు.

 

వెల్దండ నుంచి ప్రారంభమైన సేవా కార్యక్రమం ఆమనగల్లు, కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఐదు శిబిరాలను విజయవంతంగా పూర్తి చేసుకుని కడ్తాల్‌కు చేరుకుందని తెలిపారు. ఇప్పటివరకు ఐదు శిబిరాల్లో 19,200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి, 722 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, 13,075 మందికి పైగా కంటి అద్దాలు అందించినట్లు వివరించారు. కడ్తాల్‌లో సెప్టెంబర్‌ 11 నుంచి 16 వరకు ఉచిత కంటి పరీక్షలు, సెప్టెంబర్‌ 15 నుంచి 19 వరకు అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు ఆసిఫ్‌ అలీ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గూడూరు భాస్కర్‌ రెడ్డి, కడ్తాల్‌ సర్పంచ్‌ బిక్షపతి, మాజీ సర్పంచ్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, నాయకులు, యువజన నాయకులు, ఐక్యత ఫౌండేషన్‌ ప్రతినిధులు, శంకర నేత్రాలయ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.