CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బలమే జీవనం.. బలహీనతే మరణం

  • యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలి: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 133వ చికాగో ఉపన్యాస వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్‌ యూత్‌ ప్రాజెక్ట్‌, నీఫా, తెలంగాణ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను శుక్రవారం మేయర్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ “బలమే జీవనం.. బలహీనతే మరణం” అనే స్వామి వివేకానంద సందేశం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యువతలో తగ్గుతున్న మానవతా విలువలు, గౌరవమర్యాదలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని తిరిగి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చెడు మార్గాలకు దూరంగా ఉంటూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. చెడు మార్గాలను ఎంచుకుంటే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు.

ప్రతి యువకుడు మంచి వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైన నడవడికను అలవరచుకుని సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో యువత నడుస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతలో దేశభక్తి, సేవా దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో నేషనల్‌ యూత్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, 3వ డివిజన్‌ కార్పొరేటర్‌ సాధినేని లావణ్య మునీందర్‌, యువ నాయకులు గాండ్ల నరేష్‌, వడ్డేపల్లి రాజు, కొలగాని అభినయ్‌తో పాటు ఎన్‌వైపీ సభ్యులు పాల్గొన్నారు.