- తయారీ నుంచి విక్రయం వరకు అన్ని దశలపై ఆంక్షలు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్ 10, 2026 నుంచి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నాన్-డెయిరీ, కృత్రిమ లేదా అనలాగ్ పనీర్‌ను ఏ రూపంలోనైనా తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయించడంపై నిషేధం వర్తించనుంది. అంటే ఉత్పత్తి దశ నుంచి వినియోగదారుడికి విక్రయించే వరకు అన్ని దశల్లోనూ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 30(2)(a) కింద రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌కు ఉన్న అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిషేధం ఏడాది పాటు అమల్లో ఉండనుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసినట్లు, సెప్టెంబర్ 10, 2026 తేదీతో వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807లో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం.
నిషేధ ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గెజిట్ నోటిఫికేషన్‌ను ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను అధికారులు ఆదేశించారు. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.