CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:45 am Posted by : CHAITHANYA GALAM NEWS

శాంతిభద్రతల పరిరక్షణతోనే గణేష్ ఉత్సవాలు

  • మార్గదర్శకాల పోస్టర్‌ విడుదల చేసిన సీపీ గౌష్‌ ఆలం

కరీంనగర్(చైతన్యగళం): గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం సూచించారు. కమిషనరేట్‌ పరిధిలోని అస్త్ర కన్వెన్షన్‌ హాల్‌లో గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన భద్రతా మార్గదర్శకాల పోస్టర్‌ను పోలీసు అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు.

కొత్త మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, వివాదాస్పద ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయరాదని సీపీ స్పష్టం చేశారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో కనీసం ముగ్గురు నిర్వాహకులు కాపలా ఉండాలని సూచించారు. రహదారులకు ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసి, అత్యవసర వాహనాలకు మార్గం ఉండేలా చూడాలన్నారు.

ఉత్సవాల్లో డీజేలకు పూర్తిగా అనుమతి లేదని, నిబంధనల మేరకు రెండు సాధారణ ధ్వనివర్ధక పరికరాలు మాత్రమే వినియోగించాలని తెలిపారు. రెచ్చగొట్టే పాటలు, వ్యాఖ్యలు ప్రసారం చేస్తే చర్యలు తప్పవన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్స్‌, మహిళా కానిస్టేబుళ్లతో నిఘా ఉంటుందని, వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిమజ్జన మార్గాలు, సమయాల్లో చివరి నిమిషంలో మార్పులు చేయరాదని, వాహనాల డ్రైవర్లు మద్యం సేవించకుండా నిర్వాహకులు పర్యవేక్షించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని, అత్యవసర పరిస్థితుల్లో 100, 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు.

సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్‌, సతీష్‌, యాదగిరిస్వామి, ఉత్సవ సమితి అధ్యక్షుడు కె.మహేశ్వర్‌, పండితులు శ్రీనివాస శర్మ, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర ప్రముఖ్‌ రాధాకృష్ణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి శ్యామ్‌, మండప నిర్వాహకులు పాల్గొన్నారు.