కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆయుధాగారంతో పాటు కమిషనరేట్ కేంద్రంలోని 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌కు చెందిన ఆయుధాగారాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుధ భద్రతా గదిలోని భద్రతా ప్రమాణాలు, ఆయుధాల నిల్వ విధానం, రక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆయుధాగారంలో ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రి వివరాలను అధికారిక రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. సిబ్బందికి ఆయుధాల కేటాయింపు, తిరిగి జమ చేసే వివరాలతో కూడిన లాగ్‌బుక్‌లు, నిల్వ రిజిస్టర్లను పరిశీలించి రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయుధాల పనితీరు సక్రమంగా ఉండేలా నిరంతరం సర్వీసింగ్ చేపట్టాలని, భద్రతా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని అడ్మిన్ ఆర్‌ఐ శ్రీధర్‌రెడ్డి, సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు. ఆయుధాల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్, ఆయుధాగార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.