CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 3:21 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ

  • 13న ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ, శ్రీనివాస కల్యాణం – ఆత్మీయ సమ్మేళనం

షాద్‌నగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమాజ అభివృద్ధి, ఐక్యతకు వేదికగా నిలవనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గందె సురేష్ గుప్తా తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావది లక్ష్మీనారాయణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

భూమిపూజతో పాటు శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందన్నారు. సమాజ ఐక్యత, అభివృద్ధి, యువత, మహిళలు, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గందె సురేష్ గుప్తా అన్నారు. సమాజంలోని వివిధ కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆర్యవైశ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఈ భవనం కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాలూకా, మండల, పట్టణ, గ్రామస్థాయి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, యువత, మహిళలు, సమాజ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.