CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:49 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బీఆర్‌ఎస్‌ నేతల తీరు దొంగే.. దొంగా అన్నట్లుంది

  • పోలీసులపై గులాబీ నేతల దౌర్జన్యంపై కిచ్చెన్న ఆగ్రహం

మహేశ్వరం, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): ప్రజాస్వామ్యానికి వేదికైన అసెంబ్లీ వద్ద అలజడి సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేశారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, నల్లచొక్కాలు ధరించి సభకు వచ్చి తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు.

పోలీసుల పట్ల బీఆర్‌ఎస్‌ నేతలు దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారని అన్నారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను శాశ్వతంగా సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోయినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దళితుడైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్‌ పదవి కల్పించిందని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఘటనపై రెండు రోజులైనా మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు కపట నాటకాలు ఆపి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, నెలనెలా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌ శాసనసభకు హాజరు కావాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.