CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించేది క్రీడలే: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా సిటీ లెవల్‌ రగ్బీ పోటీలు కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖేలో ఇండియా–అస్మిత వంటి కార్యక్రమాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కరీంనగర్‌ జిల్లాలో రగ్బీ అభివృద్ధికి రగ్బీ అసోసియేషన్‌ చేస్తున్న కృషిని మేయర్‌ అభినందించారు. పోటీల్లో వివిధ పాఠశాలల క్రీడాకారులు, ముఖ్యంగా బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ, వివిధ జిల్లాల కార్యదర్శులు, రగ్బీ అభివృద్ధి అధికారి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.