CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:48 am Posted by : rakeshkashaveni12@gmail.com

ఉద్యోగాల పేరుతో రూ.44 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (చైతన్యగళం):

నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో నిరుద్యోగులను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిని కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్లపల్లి గ్రామానికి చెందిన దుడపాక తిరుపతి అలియాస్‌ తిరుపతిరావు (51)ను మంగళవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు తనను శాతవాహన యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుని, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 21 మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ పరీక్షలు నిర్వహించి, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ పత్రాలు, సర్వీస్‌ రిజిస్టర్లు, నియామక ఉత్తర్వులు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదుదారు, ఆమె బంధువుల నుంచి సుమారు రూ.10 లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు జారీ చేసినట్లు కేసు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, ఇతర కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, నియామక ఉత్తర్వులు, ఉద్యోగ ఆఫర్లను సంబంధిత సంస్థల అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని కరీంనగర్‌ పోలీసులు సూచించారు. కేసులో పరారీలో ఉన్న నరసింహమూర్తి, కోలా వెంకటేశ్వర్‌రావు, దుడపాక లావణ్య, ఈట్ల సత్యం, రాజశేఖర్‌, అంజయ్య, బొల్లా నాగరాజుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టయిన నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.