- ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ.. అక్కడే పథకం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రకు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం శాసనసభలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై చర్చించేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 22ఏ భూములు సహా అన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, వాటిపై చర్చ జరిగితే బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే పథకం
అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని సమావేశం నిర్వహించారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా అడ్డుకునేందుకే అక్కడ ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో రూపొందించిన పథకానికి వ్యతిరేకంగానే అక్కడ నిరసన చేపట్టామని, దాడులు చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.
అసెంబ్లీ ఎదుట విధులు నిర్వహిస్తున్న పోలీసు, ఇతర ఉద్యోగులపై దాడి చేయడం, స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సీఎం అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరును సమాజం మొత్తం ఖండించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో డప్పులు కొడుతూ దండోరా వేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశామని తెలిపారు.
కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం
కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం అని రేవంత్‌రెడ్డి అన్నారు. గొప్ప లక్ష్యంతో ఆవిర్భవించిన కాంగ్రెస్ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు. అణచివేత, వివక్షకు గురైన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంక్షోభాలతో పాటు దేశం ఎదుర్కొన్న పలు క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించిందని సీఎం తెలిపారు. బ్రిటిష్ పాలనలోని దోపిడీ, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దేశాన్ని ప్రపంచ దేశాల ఎదుట గర్వంగా నిలబెట్టిందని రేవంత్‌రెడ్డి అన్నారు.