CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

లేబర్‌ కోడ్‌ల రద్దుకు ఉద్యమాలకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ పిలుపు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలు, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లపై మహాసభల్లో విస్తృతంగా చర్చించారు.

33 జిల్లాల నుంచి 650 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు హాజరుకాగా, 92 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. గత మూడేళ్లలో ఏఐటీయూసీ, అనుబంధ సంఘాలు నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలు, సంఘ నిర్మాణంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాల్‌రాజ్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతినిధులు చర్చించారు.

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మహాసభల ఏర్పాట్లను చీఫ్‌ ప్యాట్రన్‌ చాడ వెంకటరెడ్డి, ప్యాట్రన్‌ కలవేన శంకర్‌, అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. ప్రతినిధుల సభకు అధ్యక్ష వర్గంగా టేకుమల్ల సమ్మయ్య, ప్రేమ్‌ పావని, వాసిరెడ్డి సీతారామయ్య, యూసుఫ్‌ వ్యవహరించారు.