- నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసిన ప్రభుత్వ పెట్రోలింగ్ ఇన్నోవా క్రిస్టా వాహనం అపహరణకు గురైన ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7న రాత్రి విధులు ముగిసిన అనంతరం సుమారు 11.45 గంటలకు TS-09-PA-3794 నంబరు గల పెట్రోలింగ్ వాహనాన్ని స్టేషన్ ప్రాంగణంలో నిలిపారు. అనంతరం వాహనం కనిపించకపోవడంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా మొహమ్మద్ అజాజ్ (28) స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించి వాహనం తాళాలు తీసుకుని వాహనాన్ని అపహరించినట్లు గుర్తించారు.
వాహనానికి సంబంధించిన అధికారి ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ 305(బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వాహనం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. విచారణలో కుటుంబ కలహాల కారణంగా భార్య తనను విడిచి వెళ్లినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.