CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 11:00 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ధర్మపురి ఆలయాభివృద్ధికి రూ.200 కోట్లతో పనులకు శ్రీకారం

ధర్మపురి, సెప్టెంబర్ 7 (చైతన్య గళం):

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం వేకువజామున 2.58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఆలయంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛారణలతో వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో ధర్మపురి ఆలయాభివృద్ధిపై పలువురు హామీలు ఇచ్చినా నిధులు కేటాయించలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభ్యర్థన మేరకు మరో రూ.80 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు రూ.10 కోట్లతో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ.58.55 కోట్లతో తొమ్మిది రకాల మౌలిక వసతులు, ఆలయ అభివృద్ధి పనులు, రూ.22.16 కోట్లతో గోదావరి పుష్కరాల కోసం నూతన పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో రూ.2.48 కోట్లతో నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మపురి క్షేత్రం రూ.200 కోట్లతో అభివృద్ధి చెందనుండటంపై భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.