జగిత్యాల, సెప్టెంబర్ 7 (చైతన్యగళం):
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని వైష్ణవి కళాశాలలో డివైఎఫ్ఐ జిల్లా 4వ మహాసభ జిల్లా నాయకులు విజయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ పటేల్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని కోరారు. జగిత్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక యువత హైదరాబాద్, ఇతర నగరాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డివైఎఫ్ఐ జగిత్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బండపల్లి రాజశేఖర్, కార్యదర్శిగా కొడిశెల విజయ్, ఉపాధ్యక్షులుగా అలుసె వినయ్, బూర్ల పూజిత, కుంట నర్సింహారెడ్డి, సహాయ కార్యదర్శులుగా బచ్చల వినోద్, ఎల్. రమ్య, బుర్ర అజయ్ ఎన్నికయ్యారు.