అక్కన్నపేట, సెప్టెంబర్ 7 (చైతన్య గళం): విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు కర్ణకంటి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో బీజేవైఎం అక్కన్నపేట మండల అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి ఉన్నారు.