CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 11:01 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం తప్పదు

కరీంనగర్, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక నియమావళిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో ఏఐటీయూసీ తెలంగాణ నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ సర్కస్‌ గ్రౌండ్‌ వరకు సాగింది సభలో అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని విధానం, కార్మిక హక్కులు ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్నవని తెలిపారు. కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక నియమావళిని తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి రంగంలో కార్మిక సంఘాలను బలోపేతం చేయాలని అన్నారు. సంఘాలు లేని రంగాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితం చేయాలని సూచించారు. సీపీఐ సీనియర్‌ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.