- కరీంనగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న పీఆర్సీ సాధన సంకల్ప సభను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కరివేద మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తన మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పలు హామీలు ఇచ్చిందన్నారు. ఆరు నెలల్లో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డీఏలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 25ను సవరించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.
పీఆర్సీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వేతన వ్యత్యాసాలను తగ్గించాలని, ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు అందించాలని అన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ కాంపిటెంట్ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండి, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యా వాలంటీర్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం నిర్వహిస్తున్న పీఆర్సీ సాధన సంకల్ప సభకు ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మహిపాల్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఊకంటి విజయేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడప శేఖర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆకుల కిషన్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు వెంకటేశం, జలపతి రెడ్డి, శాంతికిరణ్, శ్రీధర్, చంద్రారెడ్డి, పూర్ణచందర్, పాపిరెడ్డి, ఆంజనేయులు, నవీన్ చందర్, సాయిరెడ్డి, ప్రశాంత్, శంకరయ్య, మహేందర్, సుజాత, మంగ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.