CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:28 am Posted by : CHAITHANYA GALAM NEWS

అంబేద్కర్ సిద్ధాంతాల పేరిట దందాలు చేస్తే ఊరుకోం

  • ​అంబేద్కర్ భవనం పేరుతో రూ.30 లక్షల వసూళ్లు
  • మహనీయులు ఆశయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం

పెద్దపల్లి,సెప్టెంబర్ 04(చైతన్యగళం):
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరైతే,ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పేరును అడ్డుపెట్టుకొని బొంకూరి మధు అనే వ్యక్తి స్థానిక మార్వాడీ వ్యాపారి ఆనంద్ లావోటీ నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి ఆ స్థలాన్ని అక్రమంగా లీజుకు ఇచ్చారని మహనీయులు ఆశయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొంకూరి కైలాసం మాట్లాడుతూ గతంలో ఈ అక్రమంపై పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విచారణలో,తాను తీసుకున్న డబ్బులను ఐదు రోజుల్లో తిరిగి చెల్లిస్తానని మధు స్వయంగా ఒప్పుకున్నప్పటికీ,ఆ తర్వాత మాట మార్చి పోలీసు కమిషనర్‌ కు, సీఐలతో పాటు తమపైనే లాయర్ నోటీసులు పంపించడం ఆయన బరితెగింపునకు నిదర్శనమని మండిపడ్డారు.మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లింగమల్ల శంకరయ్య ఒక సొసైటీని ఏర్పాటు చేసి తోటి ఉపాధ్యాయుల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని,చందాలు ఇవ్వడానికి నిరాకరించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అబద్ధపు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

అంబేద్కర్ సిద్ధాంతాలకు, సంఘాల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ,పలువురు ఉన్నతాధికారులపై నిందలు వేస్తూ,పలు కార్యక్రమాల పేరిట ప్రజల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.350 వసూలు చేస్తున్న ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ మొత్తం భూ అక్రమాలపై జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్‌ తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని,లీజు పేరిట కాజేసిన రూ. 30 లక్షలను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో సెప్టెంబర్ 7 నుండి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మహనీయులు ఆశయ సంఘం పట్టణ అధ్యక్షులు కండే కరుణాకర్,కుక్క రవి,తేరి బాలకృష్ణ గుడివేల రవి పాల్గొన్నారు.