కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం):
కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ యువ సమరభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగాలు అడిగిన యువతపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. హామీలను నెరవేర్చలేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే బర్తరఫ్ అవుతుందని వ్యాఖ్యానించారు సభలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు, యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.