- బీఆర్‌ఎస్, కౌశిక్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు – హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్
హుజురాబాద్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా రెండున్నరేళ్లలో కౌశిక్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా తాను ఏం తీసుకొచ్చానో ప్రజల ముందు రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కళ్లముందే కనిపిస్తున్నా బీఆర్‌ఎస్ నాయకులకు అవి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, క్వింటాలుకు రూ.500 బోనస్, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
‘నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి’
కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న రెండున్నరేళ్లలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం అందించారో ప్రజలకు వివరించాలని ప్రణవ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, తన ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించామని, కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. నూతన బస్సు రూట్లను ఏర్పాటు చేయించామని, కమలాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించామని తెలిపారు. రాబోయే రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లతో పాటు హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పేదలకు అందిస్తామని చెప్పారు.
కమలాపూర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కమలాపూర్ మండల అభివృద్ధికి కౌశిక్‌రెడ్డి ఎలాంటి కృషి చేయలేదని ప్రణవ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణానికి వచ్చిన నిధులను కూడా ఎమ్మెల్సీగా ఉండి తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్‌స్టాండ్‌కు నిధులు సమకూర్చడంతో పాటు మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
కమలాపూర్ మండలానికి శ్మశానవాటిక కోసం మంజూరైన నిధులను వీణవంకకు తరలించారని ఆరోపించారు. కమలాపూర్‌లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఇప్పటికే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి వైద్య, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలకు ముందుగా కౌశిక్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలే సాక్ష్యాలని, వాస్తవాలను కళ్లారా చూసి బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడాలని ప్రణవ్ హితవు పలికారు. కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.