కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)కు చెందిన అధ్యాపకులు బి. రజనిదేవి, ఎం. కల్పన, సతీష్ కుమార్‌లను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, నాణ్యమైన బోధనకు, విద్యా రంగానికి వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి పురస్కార గ్రహీతలను అభినందించారు. ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర కృషి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న అధ్యాపకులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.