CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 4:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తీగలగుట్టపల్లి రైల్వే గేట్‌ వద్ద తారురోడ్డు పూర్తి

  • రూ.28 లక్షల మున్సిపల్‌ నిధులతో నిర్మాణం – నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 5 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్‌, ఆర్వోబీ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ సూచన మేరకు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ చొరవతో మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి రూ.28 లక్షలు కేటాయించి తారురోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.

కరీంనగర్‌–చొప్పదండి ప్రధాన మార్గంలో తీగలగుట్టపల్లి వద్ద సరైన రహదారి సౌకర్యం లేక కొంతకాలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆర్వోబీ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కాంట్రాక్టర్‌కు 2028 వరకు గడువు ఉండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు, భూసేకరణలో జరిగిన జాప్యం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగుతున్న నిర్లక్ష్యంతో సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు పేర్కొంటున్నారు. రహదారి నిర్మించాల్సిన ఆర్‌అండ్‌బీ శాఖ నిధుల కొరతను కారణంగా చూపడంతో ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయి.

బండి సంజయ్‌ సూచనతో పనులకు శ్రీకారం

తీగలగుట్టపల్లి ఆర్వోబీ ప్రాంతంలో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ స్పందించి, వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్‌ నిధులతో తక్షణమే రోడ్డు నిర్మించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌కు సూచించారు. ఈ సూచనను వెంటనే అమలు చేసేందుకు మేయర్‌ ముందుకు వచ్చి రూ.28 లక్షల మున్సిపల్‌ సాధారణ నిధులను కేటాయించారు.

గత నాలుగు రోజులుగా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తారురోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా మేయర్‌ స్వయంగా పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు అర్ధరాత్రి సమయంలోనూ పనుల ప్రాంతానికి చేరుకుని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. పనులు పూర్తయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షించడం విశేషం.

తారురోడ్డు నిర్మాణం పూర్తవడంతో తీగలగుట్టపల్లి పరిసర ప్రాంత ప్రజలతో పాటు కరీంనగర్‌–చొప్పదండి మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.