CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:30 am Posted by : CHAITHANYA GALAM NEWS

1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహిళల ఆగ్రహం

  • దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మహిళా సదస్సు.. నిరసన, వంటావార్పు

పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మహిళలు రోడ్డుపైనే కూరగాయలు తరిగి వంటావార్పు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు ఆటపాటలు, బతుకమ్మ పాటలతో పాటు ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని ఎత్తిచూపే పాటలు పాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తుచేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెంచుతామని చెప్పిన పింఛన్లు, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్ మొత్తాల పెంపు వంటి హామీలను ఏమి చేశారని ప్రశ్నించారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా హామీలను అమలు చేయకుండా వారిని నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ‘ఒక్క నెల ఆగండి.. రూ.4 వేల పింఛన్ ఇస్తాం’ అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కో హామీ అమలును వాయిదా వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను ఆయన గుర్తుచేశారు. ఒంటరి మహిళలకు పింఛన్లు, బీడీ కార్మికులకు పింఛన్లు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలతో మహిళలకు అండగా నిలిచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి మహిళలు, పిల్లలు, కుటుంబాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలకు భరోసా కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం సైకిళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

దాసరి మమత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్ల కోసం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా పక్కన పెట్టిందని దాసరి మమత రెడ్డి విమర్శించారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మాట తప్పడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసానికి నిదర్శనమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను మరింత బలోపేతం చేయాల్సింది పోయి వాటి ప్రయోజనాలను మహిళలకు దూరం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమాన్ని రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా గతంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ఆర్థిక భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మొత్తాల పెంపు వంటి హామీలను ప్రస్తావిస్తూ.. ఎన్నికల సమయంలో మహిళలను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

మహిళలతో పాటు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేసి అర్హులకు పింఛన్లు అందించిందని, ఇప్పుడు పింఛన్ల పెంపు హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

‘మార్పు తీసుకొస్తాం’ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల జీవితాల్లో మరిన్ని సమస్యలు సృష్టించిందని దాసరి మమత రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహిళలు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదన్నారు.

మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఇచ్చిన హామీల అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలను వెంటనే అమలు చేయకపోతే మహిళలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మహిళల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దాసరి మమత రెడ్డి స్పష్టం చేశారు.