CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఉపాధ్యాయ వృత్తి అన్నింటికంటే గొప్పది

  • దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌జీ

రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): సమాజంలో మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ప్రధానమైనదని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌జీ అన్నారు. తపస్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 90 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాచం రమేష్‌జీ మాట్లాడుతూ భారతదేశం త్వరలో విశ్వగురువుగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలోని రుగ్మతలు తొలగాలన్నా విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులను స్వయంగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించడం వంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంఘం తపస్ అని అన్నారు.

తపస్ సంఘటన కార్యదర్శి కానుగంటి హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలన్నా అది ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులను ఛత్రపతి శివాజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల స్ఫూర్తితో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు.

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, పీఎస్‌హెచ్‌ఎంలు, మోడల్ స్కూల్ టీచర్లు, కేజీబీవీ ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలల టీచర్లు, పీడీలు, ఎస్‌ఏలు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో సన్మానం పొందిన ఉపాధ్యాయులతో పాటు తపస్ రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు కలిపి సుమారు 250 మంది పాల్గొన్నారు.