CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:21 pm Posted by : CHAITHANYA GALAM NEWS

22ఏ జాబితా నుంచి 6 వేల ఎకరాలను తొలగించాలి

  • రేకుర్తిలో బీఆర్‌ఎస్‌ రాస్తారోకో.. భూబాధితులు, రైతులతో కలిసి నిరసన
  • ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీలో నిలదీస్తాం: గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 4(చైతన్యగళం):
కరీంనగర్‌ జిల్లాలోని రేకుర్తి, సీతారాంపూర్‌, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో సుమారు 6 వేల ఎకరాల భూములను రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రేకుర్తి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. భూబాధితులు, రైతులతో కలిసి చేపట్టిన ఈ నిరసనలో మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు.

తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. గతంలో ఎలాంటి సమస్యలు లేని పట్టా భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు, భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాలకు భూములను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

‘రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’

కేసీఆర్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి బీడు భూములను సాగులోకి తీసుకొచ్చామని గంగుల అన్నారు. ప్రస్తుతం పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాజకీయ కారణాలతోనే కాళేశ్వరం నీటిని రైతులకు అందించకుండా చేస్తున్నారని ఆరోపించారు.

యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారని, యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవాలని చెప్పడం వల్ల నిరక్షరాస్య రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతులకు రైతుబీమా, రైతుబంధు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

5న కేటీఆర్‌ రాక

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య పరిష్కారం కోసం విద్యార్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం కరీంనగర్‌కు రానున్నారని గంగుల తెలిపారు. ఆయన కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు, భూబాధితులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.