CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 3:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సురేఖపై వేటుకు హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌!

  • రాజీనామాకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్‌కు సీఎం సిఫారసు.. చిన్నారెడ్డిపైనా వేటు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3(చైతన్యగళం): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. రాజీనామా చేసేందుకు సురేఖ అంగీకరించకపోవడంతో.. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం నుంచి ఆమోదం లభించిన అనంతరం.. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు సిఫారసు లేఖ పంపినట్లు సమాచారం. దీంతో సురేఖ వ్యవహారంపై కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.

చిన్నారెడ్డిపైనా వేటు

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది.

అదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పార్టీ క్రమశిక్షణపై అధిష్ఠానం దృష్టి

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాల్లో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ నిర్ణయాలను గౌరవించని వారు పార్టీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ క్యాడర్‌ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గతంగా చోటుచేసుకున్న విభేదాలపై అధిష్ఠానం మరింత కఠినంగా వ్యవహరించబోతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.