- కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం):
విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురైన సంచార, అర్ధసంచార జాతులకు 1952 ఆగస్టు 31న విముక్తి లభించిందని తెలిపారు. సంచార, అర్ధసంచార జాతుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్య, ఉపాధి, సామాజిక భద్రత తదితర రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు విముక్తి జాతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వారి అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తారని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేలా సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ ప్రకాష్, మందుల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేరాల రామస్వామి, మేదరి కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల రమేష్, గడ వంశీయ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్, కునపులి కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సత్యనారాయణ, వీరముష్టి కుల సంఘం ప్రతినిధి కే. వీరయ్య, మేదరి కుల సంఘం ప్రతినిధి బి. వేణుగోపాల్, గంగిరెద్దుల కుల సంఘం ప్రతినిధి చిన్న కొమురయ్య, వంశరాజ్ కుల సంఘం ప్రతినిధి లింగస్వామి, వివిధ సంచార, అర్ధసంచార కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.