పెద్దపల్లి, ఆగస్టు 30 (చైతన్య గళం):
పెద్దపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి డీసీపీతో కలిసి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పటిష్ఠ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీపీ కోరారు.