CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 10:47 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ప్రాజెక్టుల భూసేకరణకు అడ్డంకులు తొలగించాలి

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశం

సిద్దిపేట, ఆగస్టు 25 (చైతన్యగళం):

సాగునీటి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన భూ యజమానులకు పరిహారం త్వరగా అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులు, పెండింగ్‌ సమస్యలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

 

 

భూసేకరణ పరిహారం కోసం ఈ ఏడాది ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నందున అర్హులైన కేసులను గుర్తించి చెల్లింపులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంకేత సంఖ్య కేటాయించి పారదర్శకంగా చెల్లింపులు నిర్వహించాలని, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు అటవీ భూములకు సంబంధించిన అనుమతులు, పునరావాస చర్యలు, ఇతర పెండింగ్‌ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి ప్రాజెక్టుల పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి సంబంధించి పరిహారం, పునరావాసం, అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్‌ కే. హైమావతి తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూసేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.