ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలిరావాలి
కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఎన్జీవో కమ్యూనిటీ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 10 గంటలకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తమ గొంతుకను బలంగా వినిపించేలా మహాధర్నా నిర్వహించాలని అన్నారు.ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఉచితాలు, దానధర్మాలు కోరడం లేదని, తమకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన సహాయ నిరాకరణ, కలం బంద్ వంటి ఉద్యమాలను గుర్తుచేశారు. ప్రతి ఆరు నెలలకు కరువు భత్యం, ప్రతి ఏడాది వేతన పెంపు, ప్రతి ఐదేళ్లకు వేతన సవరణ సంఘం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ సంఘం అమలు, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల చెల్లింపుతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు జీవితాంతం దాచుకున్న సొంత సొమ్మును పొందేందుకు కూడా ధర్నాలు, న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగుల బకాయిలను సకాలంలో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరింత ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని దారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టాలని, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘేం లక్ష్మణరావుతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.