CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:51 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సీపీ వార్షిక తనిఖీ

కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం): నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సోమవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన సీపీ  అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ట్రాఫిక్ సమస్యలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ, జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, నగర ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగరిస్వామి, సీఐలు సంజీవ్‌కుమార్, అంజయ్య, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.