CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 12:03 pm Posted by : rakeshkashaveni12@gmail.com

విద్యార్థుల భద్రతే లక్ష్యం – మైనర్ డ్రైవింగ్‌కు చెక్

హుస్నాబాద్, ఆగస్టు 22 (చైతన్యగళం):                                మైనర్ డ్రైవింగ్‌తో జరిగే ప్రమాదాలు, అనర్థాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖీ సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. స్టేట్ రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుడు ఎస్‌ఐ ధనరాజ్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మైనర్ డ్రైవింగ్‌లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ సింగ్ జాదవ్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి కేసు నమోదైతే నిబంధనల ప్రకారం 25 సంవత్సరాల వయస్సు వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదని తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎంఈఓ బండారి మనీలా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పాఠశాలల సమీపంలో రోడ్డు భద్రతా బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు శృతి, వైష్ణవి, మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ట్రస్మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మూడు మండలాల ప్రధానోపాధ్యాయులు, పీడీ ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.