మహబూబాబాద్(చైతన్యగళం): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కమ్యూనిస్టు మేధావి అమరజీవి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ జిల్లా కార్యాలయం వీరభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో అనేక భూపోరాటాలు నిర్వహించి, లక్షలాది నిరుపేదలకు ఇంటి స్థలాలు సాధించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.
తన ప్రసంగాలతో ఎంతోమందిని ఉద్యమంలోకి తీసుకువచ్చి తెలంగాణలో సీపీఐని బలోపేతం చేశారని, జాతీయ కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి సేవలందించారని పేర్కొన్నారు. నల్లగొండ ఎంపీగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపకల్పనలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిలిచి కీలకపాత్ర పోషించారని అజయ్ సారధిరెడ్డి గుర్తుచేశారు. చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ శతాబ్ది వేడుకల్లో వీల్‌చైర్‌లో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు.
ఆయన ఆశయాలు, స్ఫూర్తితో సీపీఐని మరింత బలోపేతం చేసి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని అజయ్ సారధిరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, తండా సందీప్, వీరవెల్లి రవి, కేదాసు రమేష్, కూరాకుల పాల్, అల్లి వేణు, నక్క నాగార్జున, గాదం శ్యాంప్రసాద్ యాదవ్, నీలం వెంకటేశ్వర్లు, మంద రవి, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.