CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:17 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తప్పిపోయిన మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు

కరీంనగర్‌ రూరల్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మహిళను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదం కారణంగా స్వస్థలం నుంచి బయటకు వచ్చిన ఆమెను పోలీసులు చేరదీసి, భద్రత కల్పించడంతో పాటు తల్లిదండ్రులకు సమాచారం అందించి సురక్షితంగా అప్పగించారు.

ఈ నెల 3వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులో రాజీవ్‌ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో ఓ మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనుముల నిరంజన్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మహిళను సురక్షితంగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

విచారణలో ఆమె పేరు రూపా రాథోర్‌ (35) అని, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా ఖాటీమా ప్రాంతానికి చెందినట్లు వెల్లడైంది. భర్తతో జరిగిన గొడవ కారణంగా సుమారు నాలుగు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌ నుంచి వివిధ వాహనాల్లో ప్రయాణిస్తూ కరీంనగర్‌కు చేరుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆమెను కరీంనగర్‌కు తీసుకువచ్చి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శక్తి సదన్‌లో చేర్పించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. తమ కుమార్తె రూపా రాథోర్‌ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిందని, భర్తతో గొడవ అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

శక్తి సదన్‌లో రూపా రాథోర్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ పోలీసులు భద్రత కల్పించారు. సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు మీరాదేవి, రామ్‌గోపాల్‌ రాథోర్‌ ఉత్తరాఖండ్‌ నుంచి కరీంనగర్‌కు చేరుకుని కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డిని కలిశారు. దీంతో పోలీసుల సమక్షంలో రూపా రాథోర్‌ను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

స్వస్థలానికి తిరిగి వెళ్లేందుకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు రైలు ప్రయాణానికి అవసరమైన కొంత మొత్తాన్ని అందజేశారు. వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి, సురక్షితంగా స్వస్థలానికి చేరుకునేలా సహకరించారు.

తమ కుమార్తెను సురక్షితంగా గుర్తించి, ఇన్ని రోజుల పాటు భద్రంగా చూసుకున్న కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు రూపా రాథోర్‌, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.

రూపా రాథోర్‌ను తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో పోలీసు సిబ్బంది, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. ఒకవైపు ఆమె కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేరడంతో ఆనందం వ్యక్తం కాగా, మరోవైపు వీడ్కోలు సమయంలో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది.