CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌ సర్కిల్‌లో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కరీంనగర్‌ సర్కిల్‌లో పర్యటించి పలు విద్యుత్‌ మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యత, వేగం, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించనున్న హుజురాబాద్‌ డివిజన్‌ కార్యాలయాన్ని సీఎండీ పరిశీలించారు. అవసరమైన అనుమతులు మంజూరు చేసి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం తెలంగాణ చౌక్‌లో నిర్మాణంలో ఉన్న నూతన ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలతో పాటు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

తదుపరి వాటర్‌ వర్క్స్‌ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన సీఎండీ అక్కడ ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్‌ ప్లాంట్‌ పనులను పరిశీలించారు. ప్లాంట్‌ నిర్మాణ పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను వేగవంతం చేసి మరో నాలుగు రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ రంగంలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. చేపడుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ (ఆపరేషన్స్‌) రవీందర్‌, డీఈ రాజం, డీఈ/కన్స్ట్రక్షన్‌ చంద్రమౌళి, ఈఈ సివిల్‌ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆయా అభివృద్ధి పనుల పురోగతిని సీఎండీకి వివరించారు.